ఇప్పటి దాకా పరస్పరం కలిసి సాగిన కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలో ముసలం మొదలైంది. ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. ఇందుకు రాజరాజేశ్వరీ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఆజ్యం పోసింది. ఈక్రమంలోనే జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజరాజేశ్వరీ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ‘‘ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వేసిన పాచికలు పారవు. నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ చేసింది శూన్యం. రెండు సార్లూ ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్కు జై కొట్టారు. అయినా చేసిందేమీ లేదు. వారు ఓటర్ల దగ్గరకు ఏ మొహం పెట్టుకుని వెళ్తారు?’’ అంటూ కుమార స్వామి కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.
జేడీఎస్ అభ్యర్థి కృష్ణమూర్తితో కలిసి రాజరాజేశ్వరీ నగర్ నియోజకవర్గంలో కుమార స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘‘ఇప్పుడుంది అసలు సినిమా’’ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ కాపాడలేదని విమర్శించారు. ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై జరిగిన దాడిలో అసలు ముద్దాయి కాంగ్రెస్ అని ఆయన ఆరోపించారు. బెంగళూరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సూట్ కాదని, ఈ విషయంలో ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని కుమార స్వామి పేర్కొన్నారు.