నేతాజీని చంపింది వాళ్లే.. బీజేపీ ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

-

న్యూఢిల్లీః వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడు వార్త‌ల్లో నిలిచే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉన్నావో ఎంపీ, బీజేపీ నేత సాక్షి మ‌హారాజ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌ మరణంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. నేతాజీ 125వ జయంతోత్స‌వాల సంద‌ర్భంగా యూపీలోని ఉన్నావోలో జ‌రిగిన వేడుక‌ల్లో సాక్షి మ‌హారాజ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నేజాతీ సుభాష్ చంద్ర‌బోస్‌ను కాంగ్రెస్ చంపించి ఉంటుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అలాగే, జాతిపిత మ‌హాత్మా గాంధీ, దేశ మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ కంటే నేతాజీకి జ‌నాక‌ర్ష‌ణ అధికంగా ఉండేద‌నీ, దీని కార‌ణంగానే నేతాజీని కాంగ్రెస్ చంపించి ఉంటుంద‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ నేత చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నాయ‌కులు సాక్షి మ‌హారాజ్‌పై అగ్గిమీద గుగ్గిలం మండిప‌డుతున్నారు.

కాగా, 1897 జనవరి 23న ఒడిషాలోని కటక్ లో న్యాయవాది జానకీనాథ్ బోస్ కు జన్మించిన నేతాజీ.. భారత స్వాతంత్య్ర ఉద్య‌మంలో కీలక పాత్ర పోషించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేసి పోరు సాగించారు. అయితే, 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణంపై వివాదం ఉండగా, 2017లో కేంద్ర ప్రభుత్వం (సమాచార హక్కు చట్టం) ఆర్టీఐలో ఈ ఘటనలో ఆయన మరణించినట్టు ధృవీక‌రించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version