వరుస ఓటములు ఎదురవుతున్న అక్కడ కాంగ్రెస్ వర్గపోరు ఆగడం లేదా ?

-

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో లేకపోయినా.. వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా.. ఆ నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో ఉంది. తన ఇలాకాలోకి వస్తే ఖబర్దార్‌ అని పార్టీలోని ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. సమస్య శ్రుతిమించి కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది.

నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంటోంది. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఈ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. 2004లో ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ.. తర్వాత వచ్చిన ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఈ మధ్య టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌ మాదిగ అచ్చంపేటలో పార్టీ యాక్టివిటీస్‌లో ఉత్సాహంగా పాల్గొనడం కొత్త చర్చకు దారితీస్తోంది. అదే సమయంలో వంశీకృష్ణ, సతీష్‌ మాదిగ వర్గాల మధ్య నిప్పు రాజుకుంటోంది.

జిల్లా అధ్యక్షుడునైన తనకు చెప్పకుండా అచ్చంపేటలో సతీష్‌ మాదిగ పర్యటనలు చేయడం.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంశీకృష్ణకు ఆయన వర్గానికి ఏమాత్రం రుచించడం లేదట. కొల్లాపూర్‌కు చెందిన సతీష్‌ అచ్చంపేటలో వేలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం రోజు సతీష్‌ మాదిగపై.. వంశీకృష్ణ వర్గీలయు దాడికి పాల్పడటం కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేపింది. వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యే టికెట్‌ తనదే అని సతీష్‌ ప్రచారం చేసుకోవడమే ఈ దాడికి కారణంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఎంపీ రేవంతరెడ్డికి పీసీసీ చీఫ్‌ పదవి ఇస్తే అచ్చంపేట టికెట్‌ కన్ఫామ్‌ అయినట్టేనని సతీష్‌ వర్గం ప్రచారం చేస్తోందట. ఈ ప్రచారం గురించి తెలిసినప్పటి నుంచి వంశీకృష్ణ వర్గం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 30 ఏళ్లుగా అచ్చంపేటలో కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉన్న తమకు తెలియకుండా నియోజకవర్గంలో పర్యటనలు చేసినా.. వేరు కుంపట్లు రాజేసినా చూస్తూ ఊరుకోబోమని వంశీకృష్ణ వర్గం హెచ్చరిస్తోందట.

అయితే పీసీసీ అధికార ప్రతినిధిగా అచ్చంపేటలో తాను పర్యటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు సతీష్‌ మాదిగ. పైగా వంశీకృష్ణ నియంతలా మారారని ఆయన మండిపడుతున్నారు. ఆధిపత్య పోరు కారణంగా దారితీస్తున్న ఘర్షణలపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు కూడా. వంశీకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంపై సతీష్‌ మాదిగపై పార్టీ పెద్దలకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

తెలంగాణలో వరసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పుంజుకోలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా ఎందులోనూ కాంగ్రెస్‌ పనితీరు గొప్పగా లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కలిసి పనిచేయాల్సిన నాయకులు ఈ విధంగా తన్నుకోవడం.. కేసులు పెట్టుకోవడం ఉన్నకొద్దిపాటి కేడర్‌ను గందరగోళంలోకి నెడుతోందట. మరి.. పీసీసీ పీఠంపై కన్నేసిన పార్టీ పెద్దలు అచ్చంపేట సమస్యను పరిష్కరిస్తారో లేక.. కొత్తవాళ్లు వచ్చే వరకు తన్నుకుంటూనే ఉంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version