రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా మరిన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ బారిన పడి ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు మరిన్ని జాగ్రత్తలను పాటించాలని సూచించింది. కోవిడ్ బాధితులు అన్ని వేళలా ట్రిపుల్ లేయర్ మాస్కులను ధరించాలని తెలిపారు.
కోవిడ్ పేషెంట్లు 8 గంటలకు ఒకసారి మాస్కును మార్చాలని సూచించారు. ఒక వేళ మాస్కు తడిగా అయితే అంతకన్నా ముందుగానే మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే కోవిడ్ బాధితులకు సహాయం చేసే వారు ఎన్ 95 మాస్కులను ధరించాలన్నారు. ఇక మాస్క్‌లను పడేసే ముందు వాటిని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో స్ప్రే చేయాలని అన్నారు.
కోవిడ్ పేషెంట్లు శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉండేందుకు తగినన్ని ద్రవాలను తీసుకోవాలని అన్నారు. కోవిడ్ బారిన పడ్డవారు ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని, ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ పేషెంట్లు దూరంగా ఉండాలన్నారు.
కోవిడ్ బాధితులు ఉండే రూమ్‌లోకి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూసుకోవాలని అధికారులు తెలిపారు. శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను 40 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలని, కోవిడ్ బాధితులు వాడే వస్తువులను ఇంట్లో ఇతరులు ఎవరూ వాడకూడదని, ఇంటిని, ఇంటి పరిసరాలను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని, కోవిడ్ బాధితులు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్‌ను పరీక్షించుకోవాలని తెలిపారు.