కరోనా నుంచి కోలుకున్న అనేక మంది బాధితుల్లో ప్రాణాంతక ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. గత కొంత కాలంగా హాస్పిటళ్లకు వస్తున్న ఈ తరహా రోగుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ముంబైకి చెందిన పలువురు వైద్యులు ఈ విషయాలను వెల్లడించారు.
ముంబైకి చెందిన ఓ మహిళ ఆగస్టు 1న కోవిడ్ బారిన పడింది. తరువాత 15 రోజుల పాటు చికిత్స తీసుకుని కోవిడ్ నుంచి కోలుకుంది. కానీ తరువాత ఆమెకు నోట్లో బాగా నొప్పి, వాపులు వచ్చాయి. అయితే ఆమె సాధారణ జలుబు, ఫ్లూ సమస్య అనుకుంది. కానీ డిసెంబర్ వరకు సమస్య తీవ్రతరం అయింది. దీంతో వారు ఆమెను ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు చికిత్స చేసి మ్యుకోర్‌మైకోసిస్ అని తేల్చారు.
మ్యుకోర్‌మైకోసిస్ వ్యాధి కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడి కోవిడ్ సోకి కోలుకున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఈ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కు గురవుతున్నారని వైద్యులు తెలిపారు. కాగా పైన తెలిపిన మహిళ విషయంలో సమస్య తీవ్రతరం అయ్యే సరికి ఆమె కొండ నాలుక పై భాగంలో ఉండే చర్మాన్ని పూర్తిగా తొలగించారు. లేదంటే ఇన్ఫెక్షన్ నెమ్మదిగా కళ్లకు తరువాత మెదడుకు వ్యాప్తి చెంది అంధత్వం వస్తుందని, చివరకు ప్రాణాలు పోతాయని గ్లోబల్ హాస్పిటల్‌కు చెందిన ఈఎన్‌టీ వైద్య నిపుణుడు డాక్టర్ మిలింద్ నవలఖె వెల్లడించారు. కనుక కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఈ తరహా లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు.