కరోనా వచ్చిన వారిలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇక కొందరిలో స్వల్ప లక్షణాలు ఉంటాయి. కొందరిలో తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. పరిస్థితి తీవ్రతరం అవుతుంది. అయితే స్వల్ప, ఒక మోస్తరు లక్షణాలతో కరోనా వచ్చి తగ్గిన వారిలో 6 నెలల తరువాత కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయని సైంటిస్టులు తెలిపారు.
ఇజ్రాయెల్‌కు చెందిన సైంటిస్టులు 103 మంది కోవిడ్ పేషెంట్లపై రీసెర్చ్ చేశారు. వారికి ఏప్రిల్ 2020 నుంచి అక్టోబర్ మధ్యలో కరోనా వచ్చి తగ్గింది. అందరికీ స్వల్ప, ఒక మోస్తరు లక్షణాలు ఉన్నాయి. అయితే వారు అప్పట్లో కరోనా నుంచి కోలుకున్నా.. 6 నెలలు తరువాత అంటే.. ఇటీవలే వారిని మరోమారు పరిశీలించారు. ఈ క్రమంలో వారిలో కొన్ని కరోనా లక్షణాలు అలాగే ఉన్నాయని నిర్దారించారు. ముఖ్యంగా వారిలో 46 శాతం మందికి కనీసం ఒక్క లక్షణం పూర్తిగా తగ్గలేదు అని తేల్చారు. ఇక 22 మందికి ఇప్పటికీ అలసట ఉండగా, 15 శాతం మంది ఇప్పటికీ రుచిని, వాసనను గుర్తించడం లేదని, అలాగే మరో 8 శాతం మందికి ఇప్పటికీ శ్వాస పీల్చడంలో సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించారు. ఇలా కరోనా వచ్చి తగ్గినప్పటికీ కొందరిలో కొన్ని లక్షణాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని తెలిపారు.
అయితే రాను రాను ఆయా లక్షణాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందని, ఆయా లక్షణాలు తగ్గకపోతే మాత్రం ఏం చేయాలి ? అనే విషయాన్ని ఆలోచించాల్సి ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. ఇక సైంటిస్టులు చేపట్టిన సదరు పరిశోధనల తాలూకు వివరాలను క్లినికల్ మైక్రో బయాలజీ అండ్ ఇన్‌ఫెక్షన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.