మిగ్‌జాం తుపాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజధాని చెన్నై నగరం తుపాను ధాటికి అస్తవ్యస్తమవుతోంది. భారీ వర్షాలతో నగర ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. కుండపోత వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటుచూసినా చెరువులను తలపిస్తున్న రహదారులు.. దీవులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు.. ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం స్తంభించిపోయింది.
వర్షాల ధాటికి చెన్నైలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల వల్ల రోడ్లు, రైలు, జల, వాయు మార్గాల్లో రవాణా సేవలకు బ్రేక్ పడింది. మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీ వరద పోటెత్తుతోంది. తుపాను ప్రభావం ఎక్కువగా కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు తుపాను ప్రభావం.. భారీ వర్షాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తమవ్వాలని.. సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఇవాళ రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.