మిచౌంగ్ తుపాను ప్రభావం తీర ప్రాంతాలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ తుపాన్ ఎఫెక్ట్ తమిళనాడుపై కూడా చూపిస్తోంది. మిచౌంగ్ ప్రభావంతో చెన్నై స్తంభించిపోయింది. చెన్నై సహా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
ముఖ్యంగా వడపళని, కాంచీపురంలలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెరుంగళత్తూరు సమీపంలోని తాంబరంలో వరద నీటిలో చిక్కుకున్న 15 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. చెన్నై సహా మూడు జిల్లాలకు ఆదివారం రెడ్ అలెర్ట్ జారీ చేయగా ఇవాళ నాలుగింటికి జారీ చేశారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా చేపలవేట కోసం జాలర్లు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు.