నేటి తరంలో చాలా మంది అమ్మాయిలు.. అత్తామామ దగ్గర ఉండటానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ ఉన్నా ఆ జనరేషన్ అభిప్రాయాలకు.. నేటి తరం పోకడకు సరిపడక ఏదో విషయంలో గొడవలు పడటం జరుగుతోంది. చాలా వరకు నేటి సమాజంలో అత్తామాల వద్ద ఉండే పోకడ తగ్గిపోయింది. ఉన్న ఒకటీ అర కుటుంబాల్లోనూ మనస్పర్థలు.
అయితే సహేతుక కారణం లేకుండా అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై ఒత్తిడి తీసుకువచ్చే భార్యలకు దిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇలా భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వం కిందకే వస్తుందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పాశ్చాత్య దేశాల్లో జరిగినట్టుగా భారత్‌లో పెళ్లి కాగానే.. కుమారుడు తన తల్లిదండ్రుల్ని విడిచి వేరుగా రావటం జరగదని పేర్కొంది.
మేజర్ కాగానే లేదా పెళ్లి తర్వాత.. తల్లిదండ్రుల్ని వదిలేయటం పాశ్చాత్య దేశాల సంస్కృతి అని, దీన్ని భారతీయులు అనుసరించరని ధర్మాసనం అభిప్రాయపడింది. తల్లిదండ్రుల విషయంలో కుమారుడికి నైతికంగా, చట్టపరంగా కొన్ని బాధ్యతలుంటాయని, వృద్ధాప్యంలో వారి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.