అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఓ వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో దాదాపు ఐదుగురు దుర్మరణం చెందినట్లు తెలిసింది. కాలిఫోర్నియా లోని ఆరెంజ్ కౌంటీలో ప్రముఖ బైకర్స్ బార్ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు 11 మందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని తెలిపారు. అందులో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.కాల్పుల ఘటన గురించి సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు .. నిందితుడిని అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. నిందితుడు రిటైర్డ్ పోలీసు అధికారి అని అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తనను దూరం పెడుతున్న భార్యను లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ కాల్పులకు తెగబడినట్లు సమాచారం.