NEET-UG నకిలీ OMR డూప్లికేట్​ దాఖలు.. ఏపీ విద్యార్థినిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

-

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ-2023లో తనకు మెరుగైన ర్యాంకు వచ్చిందంటూ.. సాక్ష్యంగా నకిలీ ఓఎంఆర్‌ డూప్లికేట్​ను సమర్పించింది ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థిని. ఈ వ్యవహారంపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.20 వేల జరిమానా విధించింది. ఇలాంటి ప్రయత్నాలను న్యాయస్థానం సహించదని హెచ్చరించింది.

పరీక్ష నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దాఖలు చేసిన ఓఎంఆర్‌ పత్రం నకిలీదని, తాను సమర్పించిన వివరాలే వాస్తవమని పిటిషనర్‌ పేర్కొనడంపైనా కోర్టు మండిపడింది. ‘‘‘ఈ కేసులో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం వాస్తవాలను పరిశీలిస్తే.. రూ.2 లక్షల జరిమానా విధించాలని, పోలీసు దర్యాప్తునకు ఆదేశించాలని భావించాం. కానీ పిటిషనర్‌ వయసును దృష్టిలో ఉంచుకొని రూ.20 వేలు జరిమానా మాత్రమే విధిస్తున్నాం’’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ పురుషేంద్ర కుమార్‌ కౌరవ్‌ తెలిపారు. కేరళ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలలో తనకు ఎంబీబీఎస్‌ సీటు కేటాయించాలని కోరుతూ ఆ విద్యార్థిని వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news