చట్టసభల్లో చాలా కాలంగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల అంశంపై తాజాగా కేంద్రం లోక్‌సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టడంతో మళ్లీ చర్చకు వచ్చింది. 2010లో రాజ్యసభలో గందరగోళం మధ్య ఈ బిల్లు ఆమోదం పొందగా, లోక్‌సభలో మాత్రం దీనికి ఆమోదం లభించలేదు. ఇక ఇప్పుడు.. మోదీ సర్కార్ కొత్త నిబంధనలతో నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో బిల్లును తీసుకొచ్చింది.
కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో తీసుకునే విధాన పరమైన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకే బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. మహిళలు కూడా వృద్ధిలో భాగస్వామ్యం అయితేనే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలస్తుందని పేర్కొంది. నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానుందని వెల్లడించింది. మహిళా రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయని చెప్పింది.
అయితే ఇవాళ మహిళా రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే మహిళా బిల్లుపై చర్చ మొదలవుతుంది. మరోవైపు ఈ బిల్లుపై మోదీ సర్కార్ వైఖరిని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఇది ఎన్నికల జుమ్లా బిల్లు అంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది.