మహాకుంభ మేళాను అగౌరవపరిచేందుకు ఎవ్వరూ ప్రయత్నించినా సహించేది లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రయాగ్ రాజ్ లో త్రివేణి సంగమం వద్ద నీరు.. భక్తుల స్నానాలకు యోగంగా లేనంత బాక్టీరియాతో నిండిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదించినట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. బుధవారం యూపీ శాసనసభలో యోగి మాట్లాడుతూ.. యూపీ కాలుష్య నియంత్రణ మండలి, సీపీసీబీ అక్కడి జలాల స్వచ్ఛతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.
సంగమ ప్రదేశంలో నీరు తాగేందుకు, ఆచమనానికి అనువుగా ఉందని చెప్పారు. లీటర్ నీటిలో మూడు మిల్లీ గ్రాముల కంటే తక్కువ బీవోడీ ఉంటే అది స్నానానికి యోగ్యమని ప్రమాణాలు చెబుతున్నాయి. సంగమ స్థలంలో అది 3.94 నుంచి 5.29 వరకు వేర్వేరు స్థాయిలో ఉన్నట్టు సీపీసీబీ వెల్లడించింది. జనవరి 12-13 తేదీలలో బీవోడీ ఎక్కువగా ఉందని.. తరువాత మంచి నీిని పై నుంచి విడుదల చేయడం వల్ల తగ్గిందని జాతీయ హరిత ట్రైబ్యునల్ కి సీపీసీబీ తెలిపింది.