ఖాఖీ డ్రెస్సులో ఎవరు వచ్చినా దారుణంగా కరిచేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు ఓ డ్రగ్ డీలర్. అతడి ఇంట్లో ఆకస్మికంగా తనిఖీ చేపట్టడానికి వెళ్లిన పోలీసులపై ఆ శునకాలు ఒక్కసారిగా దాడి చేయడంతో వారు కంగుతిన్నారు. సివిల్ డ్రెస్సులో వచ్చిన వారిని మాత్రం ఏం అనకపోవడం చూసి షాక్ అయ్యారు. దీంతో సదరు వ్యక్తి కుక్కలకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడని భావించారు. ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది.
మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో కేరళలోని కొట్టాయంలో ఓ వ్యక్తి ఇంట్లో ఆదివారం రోజు రాత్రి పోలీసులు తనిఖీలకు వెళ్లారు. సోదాల నిమిత్తం ఇంట్లోకి వెళ్లిన వారిపైకి ఒక్కసారిగా కుక్కలు దాడికి దిగాయి. దాంతో షాకైన పోలీసులు అక్కడి నుంచి పరిగెత్తాయి. అయితే అనుమానిత డ్రగ్స్ డీలర్ ఇంట్లో అన్ని కుక్కలు ఉంటాయని ఊహించలేదని.. అవి హింసాత్మకంగా ప్రవర్తిస్తాయని అనుకోలేదని పోలీసులు తెలిపారు. దాంతో తాము సరిగా సోదాలు చేయలేకపోయామని కొట్టాయం ఎస్పీ వెల్లడించారు. ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా కుక్కలకు శిక్షణ ఇచ్చాడని చెప్పారు. అధికారులు కుక్కల దాడి నుంచి తమను తాము రక్షించుకునే సమయంలో.. నిందితులు జారుకున్నారని సమాచారం.