దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆప్ అధినేత, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు మూడుసార్లు నోటీసులు పంపింది. ఆయన మూడుసార్లు విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఆప్ నేతలు భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి తమకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉందని వారు అంటున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే మార్గాన్ని దిల్లీ పోలీసులు దిగ్బంధించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తలెత్తబోయే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు.
కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు జరపనున్నట్లు తమకు సమాచారం అందుతోందని ఆప్ కీలక నేత ఒకరు అన్నారు. బహుశా ఆయన్ని అరెస్ట్ చేయొచ్చని ఎక్స్లో పోస్టు కూడా చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తనతో ధ్రువీకరించాయని ‘డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ ఆఫ్ దిల్లీ’ ఛైర్‌పర్సన్ జాస్మిన్ షా తెలిపారు.