సోనియా గాంధీకి ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీసు సీజ్

-

నేషనల్ హెరాల్డ్​ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీల్ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్. మంగళవారం నుంచి దిల్లీ, లఖ్​నవూ, కోల్​కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్​కు చెందిన హెరాల్డ్​ హౌస్​లోని యంగ్ ఇండియన్​ ఆఫీస్​ను సీజ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తమ అనుమతులు లేకుండా ఆ కార్యాలయాన్ని ఎవరూ తెరవకూడదని స్పష్టం చేసింది.

మంగళవారం జరిపిన ఈడీ దాడుల్లో అధికార ప్రతినిధులు హాజరుకానందున సాక్ష్యాలను సేకరించలేకపోయామని, వాటిని భద్రపరిచేందుకే తాత్కాలికంగా సీజ్​ చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్​ హెరాల్డ్​ ఆఫీస్​లో యంగ్​ ఇండియన్​ సంస్థ మినహా మిగతా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు, యంగ్ ఇండియన్​ కార్యాలయం సీజ్ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, జన్​పథ్​లోని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి వద్ద భారీ సంఖ్యలో మోహరించారు.

దిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రోడ్డును ఎందుకు బ్లాక్​ చేశారని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ప్రశ్నించారు. ఇది ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మిస్టరీగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి.. మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version