దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో ఈనెల 14వ తేదీన అగ్నిప్రమాదం జరగింది. అయితే ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ ఓ షాక్ తగిలింది. మంటలు ఆర్పే సమయంలో ఆ ఇంట్లో పెద్దఎత్తున కరెన్సీ కట్టలు కనిపించాయి. ఈ విషయం కాస్త పోలీసుల వద్దకు చేరింది. వారు ఆ నగదు సీజ్ చేసి విచారణ జరపగా ఆ నగదంతా లెక్కల్లో చూపనిదిగా తేలింది. ఈ విషయం కాస్త సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని కొలీజియం వద్దకు చేరడంతో ఆయన తీవ్రంగా పరిగణించి ఈ ఘటనపై తాజాగా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. అయితే గతంలో వర్మ అక్కడే పని చేసి 2021లో దిల్లీకి న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఇక ఇప్పుడు తిరిగి మళ్లీ అక్కడికే బదిలీ కావడం గమనార్హం. అయితే ఈ ఘటనతో న్యాయశాఖపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని కొలీజియంలోని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వర్మను కేవలం బదిలీ చేయడం తగదని, ఆయన్ను రాజీనామా చేయమని కోరాలని లేదా.. సీజేఐ అంతర్గత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.