క్వశ్చన్ పేపర్స్ లీకేజీ, గ్రేస్ మార్కులు తదితర వివాదాల్లో చిక్కుకుని పెను దుమారం రేపిన నీట్ – యూజీసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం రోజున రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. నీట్ కౌన్సెలింగ్‌పై కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా నీట్ పశ్నాపత్రాల లీకేజీపై సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే వెలువడిందని గుర్తు చేశారు. ఎంబీబీఎస్ కోర్సుల్లో తొలి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ఆగస్టు 14వ తేదీన ప్రారంభమవుతుందని చెప్పారు. చివరిదైన నాలుగో విడత కౌన్సెలింగ్ అక్టోబరు 24వ తేదీన జరుగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నమోదు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభవుతుందని అనుప్రియా పటేల్ పేర్కొన్నారు. ప్రవేశాల ప్రక్రియ ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై ఎలాంటి తప్పులు జరగబోవని, పటిష్ఠ చర్యలు తీసుకుంటామని అనుప్రియా స్పష్టం చేశారు.