జార్ఖండ్ గుమ్లా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుమార్తె పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఓ వ్యాన్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చైన్‌పుర్ సబ్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మరొక ఆస్పత్రికి మార్చారు. పెళ్లి అయిన రోజే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో వ్యాన్లో సుమారు 45 నుంచి 55 మంది ఉన్నట్లు తెలిపారు. మృతులు సుందర్ గయార్(50), లుందారి దేబి(45), సబితా దేబి, పులికర్ కిండో(50), అల్సు నగేసియాగా గుర్తించారు పోలీసులు. కాగా, సుందర్ గయార్, లుందారి దేబి భార్యాభర్తలు. గాయపడిన వారిలో 15 ఏళ్లలోపు చిన్నారులు సహా 9 నెలల నవజాత శిశువు కూడా ఉన్నట్లు సమాచారం.