కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రాజకీయం వేడి రాజుకుంటోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏకంగా కర్ణాటక ప్రచారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. ఎలాగైనా ఈ సారి కన్నడ కస్తూరిని తమ సొంతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ రాష్ట్రంలో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాజాగా మోదీ హోస్పేట బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బజ్‌రంగ్ బలిని జైల్లో బంధించాలని చూస్తోందని మోదీ ఆరోపించారు. బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై మండిపడ్డారు. గతంలో రాముడంటే ఇష్టపడని కాంగ్రెస్.. ఇప్పుడు బజ్‌రంగ్ బలిని కూడా ఇష్టపడటం లేదని విమర్శించారు. తమ ఎన్నికల ప్రణాళికలో కర్ణాటకను నంబర్ వన్ చేసే రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ బజ్‌రంగ్‌బలి అని నినదించే వారిని జైల్లో పెట్టాలని చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.