ఝార్ఖండ్‌లోని పలామూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగరుంటారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 75పై ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గాఢ్వాలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఇదే పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీరియా తోమర్ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
మృతులను బిమ్లేశ్ కుమార్ కనౌజియా(42), అరుణ్ భుయాన్(30), బికేశ్ భుయాన్(20), రాజ కుమార్(21), రాజ్‌కుమార్ భుయాన్(53)గా పోలీసులు గుర్తించారు. వేరే రాష్ట్రంలో పని నిమిత్తం వీరంతా శుక్రవారం ఉదయం శక్తిపంజ్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లాల్సి ఉందని.. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌కు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.