ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు. గజియాబాద్ జిల్లాలోని మూడంతస్థుల భవనంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ బృందాలతోపాటు ఇతర శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఓ మహిళతోపాటు చిన్నారని కాపాడినట్లు చెప్పారు.
మొదటి అంతస్థులో చెలరేగిన మంటలు వేగంగా ఒకటి, రెండు అంతస్థులకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. దీంతో పలువురు నివాసితులు చిక్కుకుపోయినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన నివాసంలో ఫోమ్ నిల్వలు ఉండటం వల్లనే మంటలు వేగంగా విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన భవనం నుంచి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గుర్ని దిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.