ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో తలకు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినా ప్రాణాపాయం నుంచి తప్పించకునేందుకు వీలుంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు చెబుతున్నా.. కొందరు వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తలకు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నారు. ఫలితంగా యాక్సిడెంట్ల బారిన పడ్డప్పుడు తలకు తీవ్ర గాయాలై ప్రాణాలే కోల్పోతున్నారు. అయితే ఇదిలా ఉంటే నాసిరకం హెల్మెట్లను కూడా కొందరు ధరిస్తుండడం వల్ల వారు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. దీన్ని నివారించేందుకు కేంద్రం నడుం బిగించింది.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధన ప్రకారం.. దేశంలోని ద్విచక్ర వాహనదారులు ఇకపై బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) మార్క్ కలిగిన హెల్మెట్లనే ధరించాలి. అలాగే విక్రయదారులు కూడా ఆ గుర్తింపు ఉన్న హెల్మెట్లనే అమ్మాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఎవరైనా సరే నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఒకటి ఇదే విషయంపై 2018 మార్చిలోనే వివరాలను వెల్లడించింది. తలకు అసలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే కాదు, నాసిరకం హెల్మెట్లను ధరించడం వల్ల కూడా చాలా మంది తీవ్ర గాయాలకు గురై చనిపోతున్నారని సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. అందుకనే కేంద్రం తాజాగా ఈ నిబంధనను అమలులోకి తెచ్చింది. అయితే దీన్ని ఏ విధంగా అమలు చేస్తారో చూడాలి..!