జీ-20 శిఖరాగ్ర సదస్సుకు దిల్లీ ముస్తాబైంది. ఇప్పటికే కొంతమంది సభ్య దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాకతో సందడి మొదలైంది. ఓవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా భారత్ బయల్దేరారు. ఈ సాయంత్రానికి ఆయన దిల్లీ చేరుకోనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ అగ్రరాజ్య అధ్యక్షుడికి స్వాగతం పలకనున్నారు.
మరోవైపు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా మధ్యాహ్నానికి రానున్నారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన దేశానికి రావడం ఇదే తొలిసారి. దిల్లీ విమానాశ్రయంలో రిషి సునాక్‌కు కేంద్రమంత్రి అశ్వనీ చౌబే స్వాగతం పలకనున్నారు. అటు సునాక్ బంధువులు కూడా ఆయనను ఆహ్వానించేందుకు దిల్లీ చేరుకుంటున్నారు. ఇక, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఈ మధ్యాహ్నానికి భారత్ చేరుకోనున్నారు. ఇప్పటికే అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్ దిల్లీ చేరుకోగా.. కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్థే ఆయనకు స్వాగతం పలికారు.