రానున్న నాలుగైదు రోజుల్లో ఉత్తర భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు హెచ్చరించారు. శనివారం రోజున పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టించిందని తెలిపారు. కుండపోత వర్షాలతో దిల్లీ నగరం జలమయమైందని వెల్లడించారు. వర్షాల వల్ల హస్తినలో శుక్రవారం రోజున అయిదుగురు వ్యక్తులు మృతిచెందగా.. శనివారం మరో ఆరు మరణాలతో రెండు రోజుల్లో మృతుల సంఖ్య 11కు చేరింది.
మరో నాలుగు రోజులు దిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంకోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం కురిసిన భారీవర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద సూఖీ నదిలో పలు కార్లు కొట్టుకుపోగా.. అస్సాంలో వరదల పరిస్థితి శనివారం మరింత దారుణంగా మారింది. 7 రాష్ట్రాల్లోని 1.33 లక్షల మంది వరదలతో సతమతం అవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.