నేడు పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు.. నాలుగు రోజుల పాటు అక్కడే

-

పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యమే శరణ్యమని కేంద్ర జలసంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దిశఘా అడుగు ముందుకు పడుతోంది. ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్‌ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంటుండగా.. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్‌ బి పాల్,  గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్‌ డోన్నెల్లీ, సీస్‌ హించ్‌బెర్గర్‌లు నియమితులయ్యారు. పోలవరంలో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరు నిపుణులు.

ఈ ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఈ అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు వారు అక్కడే ఉండి.. రెండ్రోజుల పాటు ప్రాజెక్టు ఆసాంతం పరిశీలిస్తారు. ఆ తర్వాత రెండ్రోజుల పాటు మేధోమథనం చేయనున్నారు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో ఈ నిపుణులను ఎంచుకున్నట్లు కేంద్ర జలసంఘం పేర్కొంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version