ఈ ఏడాది దక్షిణాసియాలో వానలే వానలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్ లుక్ ఫోరం (ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్) తెలిపింది. నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆగస్టు – సెప్టెంబరు మధ్య అనుకూల లానినో పరిస్థితులతో భారత్‌లో సాధారణం కంటే అధికంగానే వానలు పడతాయని ఇప్పటికే పలు క్లైమేట్ అంచనా సంస్థలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్ అంచనాలు వాటికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
2024 నైరుతి రుతుపవనాల కాలం (జూన్ – సెప్టెంబరు)లో దక్షిణాసియాలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్ పేర్కొంది. అయితే కొన్ని ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే కొంచెం తక్కువ వానలు పడతాయని తెలిపింది. ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్ తాజా అంచనాలను ఈ ప్రాంతంలోని తొమ్మిది వాతావరణ విభాగాలు సంయుక్తంగా రూపొందించాయి. ఇందుకు అంతర్జాతీయ నిపుణుల సహాయాన్ని తీసుకున్నాయి.