హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పోలింగ్ సమయం దాటిన తర్వాత కూడా క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు. ఓటింగ్ సమయం ముగిసే వరకు కేంద్రాలలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు హిమాచల్‌లో 65.92 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
లాహౌల్-స్పితి జిల్లాలోని స్పితి ప్రాంతంలోని తాషిగ్యాంగ్‌లో 15,256 అడుగుల ఎత్తులో ఈసీ.. పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 52 మంది ఓటర్లు ఉండగా 51 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగియగానే అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సీల్ చేశారు. అనంతరం అన్ని పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ధర్మశాల, షిమ్లా పోలింగ్ స్టేషన్‌లకు తరలించి భద్రపర్చారు. వాటిని భద్రపర్చిన పోలింగ్ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఉన్న 68 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 55,07,261 ఓటర్లు రాష్ట్రంలో ఉండగా పురుష ఓటర్లు 27,80,208 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 22,27,016 మంది ఉన్నారు. కాగా తొలిసారి ఓటు నమోదు చేసుకున్న యువ ఓటర్లు 1,86,681 ఉన్నారు. మొత్తం 7881 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 2017 ఎన్నికల్లో 75.57శాతం పోలింగ్ నమోదైంది.