కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన సీనియర్ లీడర్ని తాను కాదని భాజపా నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ అన్నారు. రాజీనామా తర్వాత తాను సోనియాగాంధీతో భేటీ కాలేదని స్పష్టం చేశారు.
ఆదివారం ముంబయిలో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ “ఇక్కడ నేను పేర్లు ప్రస్తావించదల్చుకోలేదు. మహరాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్ ని వీడారు. ఆయకు మా అమ్మతో మాట్లాడుతూ.. ‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది’ అని కన్నీటిపర్యంతమయ్యారు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అశోక్ చవాన్ ను ఉద్దేశించే అని వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.
“ఆయన చెప్పింది నా గురించే అయితే.. ఆ మాటలు నిరాధారమైనవి. నేను రాజీనామా చేసేవరకు ఆ విషయం ఎవరికీ తేలీదు. నా నిర్ణయం ప్రకటించేవరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే పని చేశాను. నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు. నేను ఆమెతో మాట్లాడి, కన్నీరు పెట్టుకున్నానన్నది నిరాధారమైన వ్యాఖ్య ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటనలు చేశారు” అని ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇదిలాఉంటే ఈ మాజీ సీఎంపై పలు కేసులున్నాయి. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో 2010లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.