ఆన్లైన్ గేమింగ్ ఫాంటసీ క్రికెట్ పేరిట ఎంతో మంది డబ్బులు పెడుతూ నష్టపోతూ చివరకు కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి. దీంతో మద్రాస్ హై కోర్టు సదరు సంస్థలను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలను హెచ్చరించింది. వారిలో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని తదితరులు ఉన్నారు. ఇక ఏపీ, తెలంగాణతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్ లైన్ రమ్మీ, ఫాంటసీ క్రికెట్ తదితర గేమ్‌లను నిషేధించారు. దీంతో రాష్ట్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐబీ మినిస్ట్రీ) ఆన్లైన్ గేమింగ్, ఫాంటసీ క్రికెట్ ఆపరేటర్లకు సూచనలు జారీ చేసింది. ఈ సూచనలు డిసెంబర్ 15 నుంచి అమలు చేయాల్సి ఉంటుంది.
* ఆన్లైన్ రమ్మీ, ఫాంటసీ క్రికెట్, ఆన్ లైన్ గేమింగ్ ఆపరేటర్లు 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారిని తమ సర్వీస్ లను ఉపయోగించుకునేందుకు అనుమతించరాదు. అనుమతిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకోబడుతాయి. 18 ఏళ్ల లోపు వారు ఆయా గేమ్‌లను ఆడేందుకు అనుమతి లేదు.
* కంపెనీలు ఆయా గేమ్‌లకు గాను ఇచ్చే ప్రకటనల్లో ఒక్కో ప్రకటన మొత్తం సైజులో 20 శాతం సైజులోపు వరకు హెచ్చరికను ప్రదర్శించాలి. ఆయా గేమ్‌లలో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ ఉంటుందనే విషయాన్ని ప్రకటనల్లో తెలియజేస్తూ హెచ్చరించాలి.
* ఒక వేళ ఆడియో, వీడియోల ద్వారా యాడ్స్ ఇస్తే వాటిల్లోనూ హెచ్చరికలు ఉండాలి. ఆ గేమ్‌లలో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ ఉంటుందనే విషయాన్ని వినియోగదారులకు కచ్చితంగా తెలియజేయాలి.
* ఆ గేమ్‌లలో డబ్బులు పెట్టడం వల్ల ఆర్థికంగా సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందనే హెచ్చరికలను కూడా ప్రకటనల్లో ఇవ్వాలి. వినియోగదారులు ఈ విషయమై ఒక వేళ నష్టం వస్తే పూర్తిగా వారిదే బాధ్యత ఉంటుందన్న విషయాన్ని కూడా కంపెనీలు ప్రకటనల్లో తెలియజేయాలి.
* వినియోగదారులకు చెందిన భాషలోనే వారికి అర్థమయ్యేలా ప్రకటనలు ఇవ్వాలి. అడ్వర్టయిజ్మెంట్ ముందు, చివర హెచ్చరికలు ఇవ్వాలి.
* ఆన్లైన్ గేమింగ్, ఫాంటసీ క్రికెట్ ద్వారా డబ్బులు సంపాదించడాన్ని ప్రోత్సహించకూడదు. దాన్ని ఉద్యోగానికి, స్వయం ఉపాధికి ప్రత్యామ్నాయంగా చూపరాదు.
* ఇతర ఉద్యోగాలు, ఉపాధి పొందే వారి కన్నా ఆన్లైన్ గేమింగ్, ఫాంటసీ క్రికెట్లో డబ్బులు పెట్టే వారే ఎక్కువగా సక్సెస్ అవుతారని కూడా కంపెనీలు చెప్పరాదు.
ఈ నియమ నిబంధనలను సదరు కంపెనీలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.