ఛత్తీస్​గఢ్​ పోలింగ్ వేళ రెచ్చిపోయిన మావోయిస్టులు.. సుక్మా జిల్లాలో ఐఈడీ బ్లాస్ట్.. బండ పోలింగ్​ స్టేషన్​పై కాల్పులు

-

ఛత్తీస్​గఢ్‌లో తొలివిడత పోలింగ్​లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ జవాన్​ గాయపడ్డారు. బస్తర్ ప్రాంతంలో ఎన్నికలు బహిష్కరించాలని ప్రజలకు మావోయిస్టులు హెచ్చరికలు చేశారు. ఇవాళ పోలింగ్ జరిగే 20 స్థానాల్లో బస్తర్ డివిజన్ లోనే 12 స్థానాలు ఉండటం గమనార్హం.

మరోవైపు మావోయిస్టుల కదలికలు గుర్తించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నారు. 60 వేల మంది పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బండ పోలింగ్​ స్టేషన్​పై కాల్పులు జరిపగా.. వెంటనే అప్రమత్తమైన జవాన్లు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. మావోలు, పోలీసుల మధ్య పది నిమిషాల పాటు ఎన్​కౌంటర్​ జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఉదయం 11 గంటల వరకు ఛత్తీస్​గఢ్​లో 26.97 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. ఉత్తర బస్తర్ కాంకెర్ లో అత్యధికంగా 34.65శాతం, కొండగావ్ లో 32.5 శాతం, అంతగఢ్ లో 28.84 శాతం ఓటింగ్ నమోదైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతాబలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news