కులాలపై ఆరా తీస్తే కఠిన చర్యలు.. విద్యార్థులకు ఐఐటీ బాంబే హెచ్చరిక

-

కుల వివక్షపై ఐఐటీ బాంబే కఠిన చర్యలు తీసుకుంటోంది. తోటి విద్యార్థుల కులగోత్రాలను అడగరాదనీ, దాని బదులు ఆటపాటలు, సినిమాలు, సంగీతంలో వారి ఆసక్తిని తెలుసుకుని కలసిపోవాలని ఐఐటీ-బాంబే మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరైనా తోటి విద్యార్థులను కులం పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

బీటెక్‌ మొదటి సంవత్సర విద్యార్థి దర్శన్‌ సోలంకి ఫిబ్రవరి 12న హాస్టల్‌ భవనం ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఐఐటీ-బాంబే క్యాంపస్‌లో కుల వివక్ష ఉందనీ, తన కులం గురించి తెలియగానే తోటి విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని సోలంకి తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు చెప్పినట్లు ముంబయి పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తోటి విద్యార్థుల కులం గురించి వాకబు చేయకూడదనీ, అలాగే వారి జేఈఈ ర్యాంకు, గేట్‌ స్కోరును కూడా ఆరా తీయకూడదని ఐఐటీ బాంబే అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ స్కోర్లను బట్టి కూడా విద్యార్థుల కులాన్ని అంచనా వేసే అవకాశం ఉండటమే దీనికి కారణం. కులమత లింగ భేదాలను ఎద్దేవా చేసేలా వ్యవహరించరాదని, వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version