వియత్నాం- భారత్ కు మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా.. భారత్ ఆ దేశానికి ఓ విశేషమైన గిఫ్ట్ ను అందజేసింది. ఏకంగా ‘ఐఎన్‌ఎస్ కృపాణ్’ అనే ఓ యుద్ధనౌకను ఆ దేశానికి అప్పగించింది. వియత్నాం పర్యటనలో ఉన్న భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్.. అక్కడ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘వియత్నాం పీపుల్స్ నేవీ’కి ఈ నౌకను అప్పగించారు. సర్వీసులో ఉన్న ఓ యుద్ధనౌకను భారత్ తన మిత్రదేశానికి బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి.
‘‘దేశీయంగా నిర్మించిన ‘ఐఎన్‌ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకు అప్పగించడం.. స్నేహపూర్వక దేశాలకు సాయం చేయడంతోపాటు వారి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచే విషయంలో భారత్ నిబద్ధతను చాటుతుంది’’ అని ఇండియన్ నేవీ తెలిపింది. భారత్‌కు 32 ఏళ్లపాటు సేవలందించిన ఈ యుద్ధనౌకను వియత్నాంకు బహుమతిగా ఇవ్వనున్నట్లు గత నెలలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు నేడు ‘వియత్నాం పీపుల్స్ నేవీ’కి అధికారికంగా అప్పగించారు.
ఐఎన్‌ఎస్ కృపాణ్.. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన భారత నౌకాదళానికి చెందిన ఖుక్రీ క్లాస్ క్షిపణి యుద్ధనౌక. క్షిపణి సామర్థ్యం కూడా ఉంది. 1991 జనవరిలో భారత నౌకాదళంలో చేరింది. 91 మీటర్ల పొడవైన ఈ నౌక బరువు దాదాపు 1350 టన్నులు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.