ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కసు వెళ్లగక్కడం ఇప్పుడు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. భారత్‌లోని మాల్దీవులు హైకమిషనర్ ఇబ్రహీం షాహీబ్ సోమవారం ఉదయం విదేశాంగ కార్యాలయానికి వచ్చారు.
భారత్‌పై ముగ్గురు మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కసు వెళ్లగక్కడంపై ఆ దేశ ప్రభుత్వం స్పందిస్తూ.. విదేశీ నాయకులు, ముఖ్యంగా సన్నిహితమైన దేశమైన భారత్‌పై తమ ఎంపీలు విమర్శలు చేయడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అది తమ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించదని వెల్లడించింది. జరిగిన దానిపై భారతీయులకు కోపం రావడం న్యాయమేనని ఆ దేశ ఎంపీ, మాజీ స్పీకర్ ఈవా అబ్దుల్లా అన్నారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పిన ఈవా ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని భారత్‌కు విజ్ఞప్తి చేశారు.