మూడేళ్లలో తాము అధికారంలోకి వస్తామని.. కంచ గచ్చిబౌలి భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే తాము తిరిగి ఇవ్వబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాజాగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ మూడున్నరేళ్ల తర్వాతే కాదు.. ముప్పై ఏళ్ల దాకా ప్రతిపక్షంలోనే ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసానికి ప్రజలు క్షమించే పరిస్థి లేదని.. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారని బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు.
“మూడున్నరేళ్ల తర్వాత భూములను గుంజుకుంటా అంటున్నరు. 15నెలల కిందటే ప్రజలు నీ అధికారం గుంజుకున్నది మరిచిపోయావా. గతంలో బీఆర్ఎస్ ధారాదత్తం చేసిన భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేటీఆర్ భయపడుతున్నారు. అందుకే అసత్య ప్రచారంతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. కవిత, కేటీఆర్, హరీశ్ రావుల మధ్యే అధిపత్యపోరు నడుస్తోంది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పాలకులది. ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లకుండా 400 ఎకరాల భూమిని న్యాయ స్థానంలో కొట్లాడి ప్రభుత్వానికి దక్కేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది.” అని బల్మూరి వెంకట్ అన్నారు.