ఇకపై మైనర్​ను రేప్ చేస్తే ఉరి శిక్షే.. ఐపీసీకి కేంద్రం గుడ్ బై!

-

భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించే దిశగా కీలక ముందడుగు పడింది. బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న IPC, CRPC, సాక్ష్యాధార చట్టాల స్థానంలో కొత్త శాసనాలను తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయ న్యాయ సంహిత-BNS, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత-BNSS, భారతీయ సాక్ష్యా-BS పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే ప్రతిఒక్కరికీ గరిష్ఠంగా మూడేళ్లలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా కొత్త బిల్లుల్లో నిబంధనలు పొందుపరిచామని షా తెలిపారు. పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఆంక్షలు తీసుకొచ్చామన్నారు. రాజద్రోహ సెక్షన్‌ను రద్దు చేస్తున్నట్లు వివరించిన ఆయన వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం, పదవులు, పదోన్నతులు ఇప్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం, లేని హోదాలను చెప్పి మోసగించి లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవడం వంటి చర్యలను నేరాలుగా ఈ బిల్లులు పరిగణిస్తాయి. గ్యాంగ్ రేప్​ చేస్తే.. 20 ఏళ్ల జైలుశిక్ష లేదంటే యావజ్జీవ కారాగారం.. 18 ఏళ్లలోపు వారిపై అత్యాచారాలకు పాల్పడినవారికి మరణశిక్ష విధించడానికి కూడా వీలుంటుంది. మూకదాడులకు పాల్పడినవారికి ఏడేళ్లు లేదా జీవితఖైదు విధించేందుకు, అవసరమైతే మరణశిక్ష ఖరారు చేసేందుకూ అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news