కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం అసోంలో కొనసాగుతోంది. అయితే ఆదివారం రోజున జరిగిన ఈ యాత్ర మార్గంలోకి కొంతమంది బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. అంతటితో ఆగకుండా వారు జై శ్రీరామ్, మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. వారికి ప్రతిస్పందించిన రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ అభివాదం చేశారు. ఆ తర్వాత బస్సు దిగిన ఆయన వారితో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ ‘మా ప్రేమ దుకాణం ప్రతిఒక్కరికీ తెరచే ఉంటుంది. భారత్ ఏకమవుతుంది, దేశం గెలుస్తుంది’ అని ఎక్స్లో పోస్టు చేశారు.
అనంతరం జరిగిన సభలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. కొందరు బీజేపీ కార్యకర్తలు తమ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీకి, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు కాంగ్రెస్ భయపడదని అన్నారు. మరోవైపు జైశ్రీరామ్, మోదీ నినాదాలతో కాంగ్రెస్ నేత బెదిరిపోయారని బీజేపీ పేర్కొంది. అంతేకాకుండా తమ కార్యకర్తలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారని, భద్రతా సిబ్బంది ఆయన్ను నిలువరించారని విమర్శించింది.