ఇండియా పేరును కేంద్రం ఇక నుంచి భారత్‌గా మార్చబోతోందన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై తీర్మానం కూడా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇండియా పేరు మార్పుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంతమంది దీన్ని సమర్థిస్తుంటే.. మరికొంత మందేమో విమర్శిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు మోదీ సర్కార్‌పై తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడం వల్ల భయపడి.. ఇలా మార్పు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియా పేరు మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై స్పందించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఇండియా అంటేనే భారత్ అని.. ఆ విషయం రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉందని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. భారత్ అనే భావనను రాజ్యాంగం సైతం ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జై శంకర్ మాట్లాడారు. జీ 20 సహా తదితర అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.