అయోధ్య రామమందిరం ప్రతిష్ఠాపన వేళ సమీపిస్తోంది. ప్రారంభోత్సవానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల మౌనవ్రతాన్ని వీడనున్నారు మౌనీమాత. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఝార్ఖండ్‌లోని ధనబాద్‌కు చెందిన 85 ఏళ్ల సరస్వతి దేవి అక్కడ మళ్లీ రామ మందిరాన్ని నిర్మించేంత వరకు తాను ‘మౌనవ్రతం’ చేస్తానని ప్రతినబూనారు.
ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపించిన వేళ ఆమెకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. సోమవారం రాత్రి అయోధ్యకు బయల్దేరిన దేవి.. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌనవ్రతాన్ని వీడనున్నట్లు ఆమె కుమారుడు తెలిపారు. స్థానికంగా ఈమెను ‘మౌనీమాత’గా పిలుస్తారు.
“1992 నుంచి రోజులో 23 గంటలు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటున్నారు మౌనీమాత. ఏదైనా కావాలంటే సైగలతో అడుగుతారు. ఒక గంట మాత్రం మాతో మాట్లాడతారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 2020లో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన తర్వాత 24 గంటల మౌనవ్రతం పట్టారు.” అని సరస్వతి దేవి కుటుంబసభ్యులు వెల్లడించారు.