భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు : హైకోర్టు

-

భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని ఉన్నత న్యాస్థానం అభిప్రాయపడింది. భర్తతో విడిపోయిన ఓ మహిళ తన మాజీ భర్త భరణం ఇవ్వలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేసులో జస్టిస్‌ ఎస్‌.సునీల్‌దత్‌ యాదవ్‌, జస్టిస్‌ విజయకుమార్‌ ఏ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

హుబ్బళ్లికి చెందిన మహిళ కుమార్తె పుట్టాక తన భర్తతో విడిపోయింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఆదేశించిన విధంగా తన మాజీ భర్త భరణం ఇవ్వడం లేదని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన ఆధార్‌ కార్డు వివరాలను తెలియజేయాలని ఉడాయ్‌ను కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలు ఇవ్వలేమని 2021 ఫిబ్రవరి 25న దరఖాస్తును ఉడాయ్‌ తిరస్కరించింది. ఈ క్రమంలో సంస్థ నిర్ణయంపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు ఆధార్‌ వివరాలు అందించాలని హైకోర్టు.. ఉడాయ్‌ను 2023 ఫిబ్రవరి 8న ఆదేశించింది.

ఈ ఉత్తర్వులపై ఉడాయ్‌ మళ్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లగా… అత్యవసర పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తేనే ఆధార్‌ నంబరు, ఇతర వివరాలను తెలియజేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిందని సంస్థ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉడాయ్‌కు అనుకూలంగా ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version