కర్ణాటకలో వంతెన పనుల్లో జాప్యం నివారించేందుకు ఆ రాష్ట్ర మంత్రి రాత్రంతా నది ఒడ్డునే నిద్రించారు. దగ్గరుండి మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. బళ్లారిలోని పరమదేవన్ హళ్లిలోని వేదవతి నదిపై ఉన్న వంతెన పనుల్లో జాప్యం కారణంగానే నది ఒడ్డున నిద్రించి పనులను పరివేక్షించినట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీరాములు తెలిపారు.
తెబళ్లారి శివార్లలోని పరమదేవన్ హళ్లి సమీపంలో ప్రవహించే వేదవతి నదిపై వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతెన తుంగభద్ర కాలువ మీదుగా వెళ్తుంది. వంతెన పిల్లర్ల నిర్మాణం కోసం గత 20 రోజులుగా నదిలో పనులు జరుగుతున్నాయి. దానికోసం కాలువ నీటిని నిలిపివేశారు. నీటిని నిలిపివేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీరాములు వంతెన వద్దకు చేరుకున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయించేందుకు వెళ్లారు. కానీ అక్కడ.. వంతెన మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతోందని గ్రహించిన ఆయన.. రాత్రంతా నది వద్దనే ఉండి.. దగ్గరుండి మరి పనులు చేయించారు.