తిరువనంతపురంలోని కార్యవటం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్ ప్రదర్శనకు కేరళ యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ఈవెంట్ కి అనుమతి ఇవ్వకూడదని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేశారు. గతంలో చోటుచేసుకున్న ప్రతికూల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూలై 5న తిరువనంతపురంలోని యూనివర్శిటీ క్యాంపస్ లో సన్నీలియోన్ డ్యాన్స్ ప్రదర్శన జరగాల్సి ఉంది.
కేరళ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ ఈవెంట్ను నిషేధించారు. కార్యక్రమాల జాబితాలో సన్నీలియోన్ ప్రదర్శనను చేర్చకుండా చూసుకోవాలని రిజిస్తారు ఆదేశించారు. క్యాంపస్ లోపల లేదా వెలుపల అలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి యూనియన్ ను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. గతేడాది ఎర్నాకుళం జిల్లాలోని కొచ్చిన్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమానికి సన్నీలియోన్ పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా నలుగురు విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. మరో 64 మంది వరకు గాయపడ్డారు. దీనిపై అప్పట్లో కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ పూర్తిగా నిర్వహణ వైఫల్యమని, ఇకముందు అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది.