దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించిన కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై తాజాగా పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన విషయాలు నిజం కావని తోసిపుచ్చారు. మృతురాలి కటిభాగంలోని ఎముకలో పగుళ్లు, మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. మెజిస్ట్రేట్ ఎదుట చేసిన శవపరీక్షకు సంబంధించిన వీడియోలో ఎటువంటి ఫ్రాక్చర్ గురించిన వివరాలు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.
అయితే నెట్టింట వైరల్ అవుతున్న వార్తలకు మూలం.. కోల్‌కతా హైకోర్టులో మృతురాలి కుటుంబం దాఖలు చేసిన పిటిషన్ అని పలు కథనాలు ఉటంకించగా.. ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ఇటువంటి వార్తలను ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. శవపరీక్ష నివేదిక ఆధారంగా దాన్ని ఆత్మహత్య, హత్య, ప్రమాదవశాత్తుగా కేసు మార్చి విచారణ చేస్తామని వెల్లడించారు. ఈ విషయాలను భారతీయ న్యాయ సంహిత సీఆర్‌పీసీ 174 వివరిస్తుందని తెలిపారు.