రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయణ్ను మొదట పట్నాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తరలించాలని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన రబ్రీ నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆయణ్ను ఢిల్లీకి తరలించనున్నారు.
ఇక లాలూ యాదవ్ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఆయనకు తగిలిన పాత గాయంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు చెప్పారు. ఇవాళ సాయంత్రం ఆయణ్ను ఢిల్లీకి తరలించనున్నట్లు వెల్లడించారు. గతం(2022)లో పశువుల దాణ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో లాలూ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కోలుకున్నప్పటికీ.. అప్పటి నుంచి తరచూ ఆయన అనారోగ్యం పాలవుతున్నారు.