పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా లోక్ సభలోకి కొందరు దుండగులు దూసుకొచ్చిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన స్పీకర్ ఓం బిర్లా విజిటర్స్ పాస్ ల జారీపై నిషేధం విధించారు. సందర్శుకులుగా పార్లమెంటులోకి వచ్చిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు ఐబీ అధికారులు ధ్రువీకరించగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పాస్ ల జారీ తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారో మాత్రం ఆయన తెలపలేదు.
సాధారణంగా పార్లమెంటును సందర్శించాలంటే వారి నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడి పేరు మీద అభ్యర్థన చేసుకోవాలి. మొదట ఎంపీలు ఈ అభ్యర్థన చేసుకున్న వ్యక్తులు సమర్పించిన గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత భద్రతాపరమైన పరిశీలన ఉంటుంది. ప్రస్తుతం విజటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు దుండగులది కర్ణాటక అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వారి వద్ద బీజేపీ ఎంపీ ప్రతాప్ పేరు మీద జారీ అయిన పాస్‌లు ఉండగా.. ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనను ప్రశ్నించాలని, భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన దుండగులు ఆయనకు తెలిసి ఉండొచ్చని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. పార్లమెంట్ కార్యకలాపాలు వీక్షించేందుకు మూడు అంచెల భద్రతా వ్యవస్థను దాటాల్సి ఉండగా..నిందితులు లోపలికి ఎలా వచ్చారో అధికారులకు అంతుపట్టకుండా ఉంది.