ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌తో పాటు వారి వైద్య పరీక్షల నివేదిక దాఖలు చేయాలనడం కుదరదని మద్రాసు హైకోర్టుకు ఎన్నికల కమిషన్ పేర్కొంది. అలా సూచించాలంటే.. అందుకు అనుగుణంగా చట్ట సవరణ చేయాలని వివరణ ఇచ్చింది. నామినేషన్ సమయంలో ఆస్తులు, కేసుల వివరాలతో పాటు 30 రోజుల ముందు చేసిన వైద్య పరీక్షల నివేదిక దాఖలు చేయాలని అభ్యర్థులకు సూచించేలా ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోయంబత్తూరుకు చెందిన ఎస్వీ సుబ్బయ్య 2016లో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ గంగాపూర్వాలా, జస్టిస్ భరత చక్రవర్తిల ధర్మాసనం బుధవారం రోజున విచారణ చేపట్టింది. అభ్యర్థుల ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక వారి వ్యక్తిగత విషయమని ఎన్నికల కమిషన్ తరఫున వాదనలు వినిపించారు. వాటిని అడగటం కుదరదని పేర్కొన్నారు. అలా నివేదిక సమర్పించాలని సూచించాలంటే చట్టాన్ని సవరించాలని, అది విధానపరమైన నిర్ణయానికి సంబంధించిందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తులు అభ్యర్థుల వ్యాధుల గురించి తెలపాలని బలవంతం చేయడం కుదరదని చెబుతూ తదుపరి విచారణను వాయిదా వేశారు.