మహారాష్ట్ర : కొండచరియలు విరిగిపడిన ఘటనలో 15కు చేరిన మృతులు

-

మహారాష్ట్రలో బుధవారం రాత్రి రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఖలాపుర్ సమీపంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరినట్లు సీఎం ఏక్​నాథ్ షిండే తెలిపారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఇర్సల్‌వాడి కొండపై ఉన్న గ్రామంలోని 30 ఇళ్లపై మట్టిపెళ్లలు, కొండరాళ్లు పడ్డాయి. దీంతో గృహాలు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సీఎం అన్నారు. దాదాపు 100 మంది శిథిలాల కింద చిక్కుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

బాధితులను రక్షించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగం నుంచి దాదాపు 100 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని రాయ్​గఢ్ పోలీసులు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, స్థానికులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా సాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రాయ్‌గఢ్‌, పాల్‌ఘర్‌ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ రాష్ట్రం అంతటా 12 బృందాలను ఏర్పాటు చేసింది. రాయ్‌గఢ్‌, రత్నగిరి, కొల్హాపూర్‌, సాంగ్లీ, నాగ్‌పూర్‌, థానే జిల్లాలో ఒక్కో బృందాన్ని మోహరించింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version