ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఆ దేశ మంత్రి హసన్ జిహాన్ ఖండించారు. అది ‘ఫేక్ న్యూస్’ అని.. మరియం షియునా, మాల్షా షరీఫ్, హసన్ జిహాన్‌ను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు.
మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవుల విదేశాంగ శాఖ వెల్లడించింది. భావప్రకటనా స్వేచ్ఛను ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని సూచించింది. అది ద్వేషాన్ని పెంపొందించేదిగా ఉండకూడదని హితవు పలికింది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
మరోవైపు మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోదీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖలపై భారత సెలబ్రిటీలు కూడా దీటుగా స్పందిస్తూ అక్కడి అందాలను వివరిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా మాల్దీవుల మంత్రికి బదులిస్తున్నారు.