ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగిన వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది.
రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. కచ్చితంగా కేంద్రంలో కూడా వచ్చే ఏడాది హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌పై ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలు చేస్తూ… రెడ్ డైరీని ప్రస్తావించారని ఖర్గే అన్నారు. కానీ.. ఆ డైరీలో మళ్లీ రాజస్థాన్‌లో కాంగ్రెస్‌దే అధికారమని… రాసి ఉందని ఆయన అన్నారు.
రాజస్థాన్ నుంచి 25మంది బీజేపీ ఎంపీలు ఉన్నా… వారు రాష్ట్రానికి నీళ్లు, నిధులు తీసుకురాలేదని ఖర్గే తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే ప్రజలను విభజిస్తున్నారని కమలం నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కానీ… దేశాన్ని కులాల, మతాల పేరుతో విభజించే బుద్ధి బీజేపీకే ఉందని ఖర్గే విమర్శించారు. బరాన్ జిల్లాలోని తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.