ఈ జనరేషన్‌లో చేతిలో ఫోన్ లేకపోతే ఎవరికీ కాలు చేయి ఆడటం లేదు. తిన్నా, పడుకున్నా, చివరకు కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనూ కొంతమంది మొబైల్ వాడుతున్నారు. ఇక సోషల్ మీడియా వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ షార్ట్స్, టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌తో మామూలుగా రచ్చ చేయడం లేదు. కొన్నిసార్లు పని చేసే చోట కూడా ఈ వీడియోలు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తుండటంతో చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న 38 మంది విద్యార్థుల ట్రైనింగ్ మరో 20 రోజుల్లో ముగియనుంది. త్వరలో కళాశాలలో జరగనున్న ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమం కోసం ఆస్పత్రిలో రీల్స్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా చేసిన రీల్స్ వైరల్ కావడంతో ఆ విషయం కాస్తా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో విద్యార్థుల చర్యపై జీఐఎమ్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి జరిమానాతో పాటు ట్రైనింగ్‌ను మరో 10 రోజులు పొడిగించినట్లు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బసవరాజ్ తెలిపారు.